అపొస్తలుల కార్యములు 17
  • 1 వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణములమీదుగా వెళ్లి థెస్సలొనీకకు వచ్చిరి. అక్కడయూదుల సమాజ మందిరమొకటి యుండెను
  • 2 గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లిక్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమనియు,
  • 3 నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖన ములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడువిశ్రాంతి దినములు తర్కించుచుండెను.
  • 4 వారిలో కొందరును, భక్తిపరులగు గ్రీసుదేశస్థులలో చాలమందియు, ఘనతగల స్త్రీలలో అనేకులును ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలిసికొనిరి.
  • 5 అయితే యూదులు మత్సరపడి, పనిపాటులు లేక తిరుగుకొందరు దుష్టులను వెంటబెట్టు కొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేయుచు, యాసోను ఇంటిమీదపడి వారిని జనుల సభయెదుటికి తీ
  • 6 అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయిభూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చి యున్నారు; యాసోను
  • 7 వీరందరు యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి, కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలువేసిరి.
  • 8 ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి.
  • 9 వారు యాసోనునొద్దను మిగిలినవారియొద్దను జామీను తీసికొని వారిని విడుదల చేసిరి.
  • 10 వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి.
  • 11 వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.
  • 12 అందుచేత వారిలో అనేకులును, ఘనతగల గ్రీసుదేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలమందియు విశ్వసించిరి.
  • 13 అయితే బెరయలోకూడ పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని థెస్సలొనీకలో ఉండు యూదులు తెలిసికొని అక్కడికిని వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి.
  • 14 వెంటనే సహోదరులు పౌలును సముద్రమువరకు వెళ్లుమని పంపిరి; అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి.
  • 15 పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణము వరకు తోడుకొని వచ్చి, సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతనియొద్దకు రావలెనని ఆజ్ఞపొంది బయలుదేరి పోయిరి.
  • 16 పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొని యుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.
  • 17 కాబట్టి సమాజమందిరములలో యూదులతోను, భక్తిపరులైన వారితోను ప్రతిదినమున సంతవీధిలో తన్ను కలిసికొను వారితోను తర్కించుచు వచ్చెను.
  • 18 ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరుఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసునుగూర్చియు పునురుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరువీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి.
  • 19 అంతట వారు అతని వెంటబెట్టుకొని అరేయొపగు అను సభ యొద్దకు తీసికొనిపోయినీవు చేయుచున్న యీ నూతన బోధ యెట్టిదో మేము తెలిసికొనవచ్చునా?
  • 20 కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలిసికొన గోరుచున్నామని చెప్పిరి.
  • 21 ఏథెన్సువారందరును అక్కడ నివసించు పరదేశులును ఏదోయొక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపు చుండువారు.
  • 22 పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పిన దేమనగాఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడు చున్నది.
  • 23 నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీదతెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.
  • 24 జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.
  • 25 ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింప బడువాడు కాడు.
  • 26 మరియు యావద్భూమిమీద కాపుర ముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని,
  • 27 తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.
  • 28 మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించు చున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలెమన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.
  • 29 కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి యున్నదని తలంపకూడదు.
  • 30 ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.
  • 31 ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.
  • 32 మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యముచేసిరి; మరికొందరుదీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.
  • 33 ఆలాగుండగా పౌలు వారి మధ్యనుండి వెళ్లిపోయెను.
  • 34 అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరునుండిరి.