ఆదికాండము 1
  • 1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
  • 2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
  • 3 దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
  • 4 వెలుగు మంచిదైనట్టు దేవుడుచూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.
  • 5 దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
  • 6 మరియు దేవుడుజలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను.
  • 7 దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను.
  • 8 దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను.
  • 9 దేవుడుఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను.
  • 10 దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను.
  • 11 దేవుడుగడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను.
  • 12 భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను
  • 13 అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను.
  • 14 దేవుడుపగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు,
  • 15 భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను.
  • 16 దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.
  • 17 భూమిమీద వెలు గిచ్చుటకును
  • 18 పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను.
  • 19 అస్తమయ మును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.
  • 20 దేవుడుజీవముకలిగి చలించువాటిని జలములు సమృ ద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను.
  • 21 దేవుడు జల ములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను.
  • 22 దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వ దించెను.
  • 23 అస్తమయమును ఉదయమును కలుగగా అయి దవ దినమాయెను.
  • 24 దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలి కెను; ఆప్రకారమాయెను.
  • 25 దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను.
  • 26 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.
  • 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను.
  • 28 దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
  • 29 దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును.
  • 30 భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను.
  • 31 దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.