ఆదికాండము 10
  • 1 ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపె తను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.
  • 2 యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
  • 3 గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా అనువారు.
  • 4 యావాను కుమారులు ఏలీషా తర్షీషు కిత్తీము దాదోనీము అనువారు.
  • 5 వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారివారి జాతుల ప్రకారము, వారివారి భాషలప్రకారము, వారివారి వంశముల ప్రకారము, ఆ యా దేశములలో వారు వేరైపోయిరి.
  • 6 హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు.
  • 7 కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు.
  • 8 కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను.
  • 9 అతడు యెహోవాయెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టియెహోవా యెదుట పరా క్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తికలదు.
  • 10 షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు.
  • 11 ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును
  • 12 నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్ట ణము.
  • 13 మిస్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను
  • 14 పత్రుసీయులను కస్లూ హీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూ హీయులలోనుండి వచ్చిన వారు.
  • 15 కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను
  • 16 హివ్వీయులను అర్కీయులను సినీయులను
  • 17 అర్వాదీయు లను సెమారీయులను హమాతీయులను కనెను.
  • 18 తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.
  • 19 కనానీయుల సరిహద్దు సీదోనునుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిము లకు వెళ్లు మార్గములో లాషావరకును ఉన్నది.
  • 20 వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషల ప్రకారము తమతమ దేశములనుబట్టియు జాతులను బట్టియు హాము కుమారులు.
  • 21 మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను.
  • 22 షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.
  • 23 అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు.
  • 24 అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
  • 25 ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకనిపేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.
  • 26 యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మా వెతును యెరహును
  • 27 హదోరమును ఊజాలును దిక్లాను
  • 28 ఓబాలును అబీమాయెలును షేబను
  • 29 ఓఫీరును హవీలాను యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు.
  • 30 మేషానుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పు కొండలు వారి నివాసస్థలము.
  • 31 వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషలప్రకారము తమతమ దేశ ములనుబట్టియు తమతమ జాతులనుబట్టియు షేము కుమారులు.
  • 32 వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను..