ఆమోసు 3
  • 1 ఐగుప్తుదేశమునుండి యెహోవా రప్పించిన ఇశ్రా యేలీయులారా, మిమ్మునుగూర్చియు ఆయన రప్పించిన కుటుంబమువారినందరినిగూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి.
  • 2 అదేమనగా భూమిమీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటినిబట్టి మిమ్మును శిక్షింతును.
  • 3 ​సమ్మతింపకుండ ఇద్దరు కూడి నడుతురా?ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా?
  • 4 ఏమియు పట్టు కొనకుండనే కొదమ సింహము గుహలోనుండి బొబ్బ పెట్టునా?
  • 5 భూమిమీద ఒకడును ఎరపెట్టకుండ పక్షి ఉరిలో చిక్కుపడునా? ఏమియు పట్టుబడకుండ ఉరి పెట్టువాడు వదలిలేచునా?
  • 6 ​పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా?
  • 7 తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.
  • 8 సింహము గర్జించెను, భయపడనివాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండువా డెవడు?
  • 9 అష్డోదు నగరులలో ప్రకటనచేయుడి, ఐగుప్తుదేశపు నగరులలో ప్రకటనచేయుడి; ఎట్లనగా--మీరు షోమ్రోను నకు ఎదురుగానున్న పర్వతములమీదికి కూడివచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి; అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి.
  • 10 వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడుచేతను సొమ్ము సమకూర్చుకొందురు.
  • 11 కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా శత్రువు వచ్చును, అతడు దేశమంతట సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును.
  • 12 యెహోవా సెలవిచ్చునదేమనగాగొల్లవాడు సింహము నోటనుండి రెండు కాళ్లనైనను చెవి ముక్కనైనను విడిపించు నట్లుగా షోమ్రోనులో మంచములమీదను బుట్టాలువేసిన శయ్యలమీదను కూర్చుండు ఇశ్రాయేలీయులు రక్షింప బడుదురు.
  • 13 ​ప్రభువును దేవుడును సైన్యములకధిపతియు నగు యెహోవా సెలవిచ్చునదేమనగా--నా మాట ఆల కించి యాకోబు ఇంటివారికి దానిని రూఢిగా తెలియ జేయుడి.
  • 14 ఇశ్రాయేలువారు చేసిన దోషములనుబట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును; ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును.
  • 15 చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను, దంతపు నగరులును లయమగును, బహు నగరులు పాడగును; ఇదే యెహోవా వాక్కు.