హోషేయ 12
  • 1 ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు; తూర్పు గాలిని వెంటాడుచున్నాడు; మానక దినమెల్ల అబద్ద మాడుచు, బలాత్కారము చేయుచున్నాడు; జనులు అష్షూరీయులతో సంధిచేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు.
  • 2 యూదావారిమీద యెహోవాకు వ్యాజ్యెము పుట్టెను; యాకోబు సంతతివారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతికారము చేయును.
  • 3 ​తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కల వాడై అతడు దేవునితో పోరాడెను.
  • 4 అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను;
  • 5 యెహోవా అని, సైన్యములకధిపతియగు యెహోవా అని, ఆయనకు జ్ఞాపకార్థనామము.
  • 6 కాబట్టి నీవు నీ దేవునితట్టు తిరుగ వలెను; కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడ తెగక నీ దేవునియందు నమి్మక నుంచుము.
  • 7 ఎఫ్రాయిమువారు కనానీయుల వర్తకులవంటివారై అన్యాయపు త్రాసును వాడుకచేసెదరు, బాధ పెట్టవలె నన్న కోరిక వారికి కలదు.
  • 8 నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనిని బట్టియు శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు.
  • 9 అయితే ఐగుప్తుదేశములోనుండి మీరు వచ్చినది మొదలు కొని యెహోవానగు నేనే మీకు దేవుడను; నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మును డేరాలలో నివసింప జేతును.
  • 10 ప్రవక్తలతో నేను మాటలాడి యున్నాను, విస్తారమైన దర్శనములను నేనిచ్చి యున్నాను, ఉపమానరీతిగా అనేకపర్యాయములు ప్రవ క్తలద్వారా మాటలాడియున్నాను.
  • 11 నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు, గిల్గాలులో జనులు ఎడ్లను బలులగా అర్పింతురు, వారి బలిపీఠములు దున్నినచేని గనిమలమీదనున్న రాళ్లకుప్పలవలె ఉన్నవి
  • 12 యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయెను, భార్య కావలెనని ఇశ్రాయేలు కొలువు చేసెను, భార్య కావలెనని అతడు గొఱ్ఱలు కాచెను.
  • 13 ఒక ప్రవక్తద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తుదేశములోనుండి రప్పించెను, ప్రవక్తద్వారా వారిని కాపాడెను.
  • 14 ఎఫ్రా యిము బహు ఘోరమైన కోపము పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతనిమీద నేరము మోపును; అతడు పరులకు అవమానము కలుగజేసి నందుకై నేనతని నవమానపరతును.