యాకోబు 4
  • 1 మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా?
  • 2 మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్యచేయుదురు మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీ కేమియు దొరకదు.
  • 3 మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు.
  • 4 వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టియెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.
  • 5 ఆయన మనయందు నివ సింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా?
  • 6 కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేతదేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్ర హించును అని లేఖనము చెప్పుచున్నది.
  • 7 కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.
  • 8 దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.
  • 9 వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి.
  • 10 ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.
  • 11 సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చు చున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించు వాడవైతివి.
  • 12 ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?
  • 13 నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువార లారా,
  • 14 రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.
  • 15 కనుకప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.
  • 16 ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది.
  • 17 కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును.