యోహాను 2
  • 1 మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను.
  • 2 యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువ బడిరి.
  • 3 ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లివారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా
  • 4 యేసు ఆమెతో అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయ మింకను రాలేదనెను.
  • 5 ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను.
  • 6 యూదుల శుద్ధీకరణాచారప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను.
  • 7 యేసు--ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి.
  • 8 అప్పుడాయన వారితోమీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా, వారు తీసికొనిపోయిరి.
  • 9 ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియక పోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి
  • 10 ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను.
  • 11 గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి.
  • 12 అటుతరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులును ఆయన శిష్యులును కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి.
  • 13 యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి
  • 14 దేవాలయములో ఎడ్లను గొఱ్ఱలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి
  • 15 త్రాళ్లతో కొరడాలుచేసి, గొఱ్ఱలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడ ద్రోసి
  • 16 పావురములు అమ్ము వారితోవీటిని ఇక్కడ నుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను.
  • 17 ఆయన శిష్యులు నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయ బడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి.
  • 18 కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే; యే సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా
  • 19 యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను.
  • 20 యూదులు ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడు దిన ములలో దానిని లేపుదువా అనిరి.
  • 21 అయితే ఆయన తన శరీరమను దేవాలయమునుగూర్చి యీ మాట చెప్పెను.
  • 22 ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసికొని, లేఖనమును యేసు చెప్పిన మాటను నమి్మరి.
  • 23 ఆయన పస్కా (పండుగ) సమయమున యెరూష లేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచకక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి.
  • 24 అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొన లేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు
  • 25 గనుక ఎవడును మనుష్యునిగూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు.