రోమీయులకు 12
  • 1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.
  • 2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.
  • 3 తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.
  • 4 ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో,
  • 5 ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము.
  • 6 మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక,
  • 7 ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతము;పరిచర్యయైతే పరిచర్యలోను,
  • 8 బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పనికలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించు వాడు సంతోషముతోను పని జరిగింపవలెను.
  • 9 మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.
  • 10 సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.
  • 11 ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.
  • 12 నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.
  • 13 పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.
  • 14 మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు.
  • 15 సంతోషించు వారితో సంతోషించుడి;
  • 16 ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు.
  • 17 కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యు లందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి.
  • 18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.
  • 19 ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడిపగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.
  • 20 కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.
  • 21 కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.