ఎఫెసీయులకు 5
  • 1 కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.
  • 2 క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.
  • 3 మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.
  • 4 కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.
  • 5 వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై యున్నలోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయురాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును.
  • 6 వ్యర్థమైన మాటలవలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి; ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైనవారిమీదికి వచ్చును
  • 7 గనుక మీరు అట్టివారితో పాలివారై యుండకుడి.
  • 8 మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు.
  • 9 వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది.
  • 10 గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచు కొనుడి
  • 11 నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారైయుండక వాటిని ఖండించుడి.
  • 12 ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది.
  • 13 సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును; ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగేగదా
  • 14 అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు.
  • 15 దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,
  • 16 అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
  • 17 ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి.
  • 18 మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి.
  • 19 ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు,
  • 20 మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,
  • 21 క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి.
  • 22 స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి.
  • 23 క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైయున్నాడు.
  • 24 సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.
  • 25 పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,
  • 26 అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను,
  • 27 నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
  • 28 అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు.
  • 29 తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంర క్షించుకొనును.
  • 30 మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.
  • 31 ఈ హేతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారిద్దరును ఏకశరీరమగుదురు.
  • 32 ఈ మర్మము గొప్పది; అయితే నేను క్రీస్తునుగూర్చియు సంఘమునుగూర్చియు చెప్పుచున్నాను.
  • 33 మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింప వలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.