నిర్గమకాండము 20
  • 1 దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.
  • 2 నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పిం చితిని;
  • 3 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
  • 4 పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
  • 5 ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు
  • 6 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించు వాడనై యున్నాను.
  • 7 నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు.
  • 8 విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.
  • 9 ఆరు దినములు నీవు కష్ట పడి నీ పని అంతయు చేయవలెను
  • 10 ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు.
  • 11 ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.
  • 12 నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
  • 13 నరహత్య చేయకూడదు.
  • 14 వ్యభిచరింపకూడదు.
  • 15 దొంగిలకూడదు.
  • 16 నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
  • 17 నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు అని చెప్పెను.
  • 18 ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి
  • 19 నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడిన యెడల మేము చనిపోవుదుము
  • 20 అందుకు మోషేభయపడకుడి; మిమ్ము పరీక్షించుట కును, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలు గుటకును, దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను.
  • 21 ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా
  • 22 యెహోవా మోషేతో ఇట్లనెనుఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుమునేను ఆకాశమునుండి మీతో మాటలాడితినని మీరు గ్రహించితిరి.
  • 23 మీరు నన్ను కొలుచుచు, వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు.
  • 24 మంటి బలిపీఠమును నాకొరకు చేసి, దానిమీద నీ దహన బలులను సమాధానబలులను నీ గొఱ్ఱలను నీ యెద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగానుంచు ప్రతి స్థలములోను నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వ దించెదను.
  • 25 నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాని కట్టకూడదు; దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన యెడల అది అపవిత్రమగును.
  • 26 మరియు నా బలిపీఠముమీద నీ దిగంబరత్వము కనబడక యుండునట్లు మెట్లమీదుగా దానిని ఎక్క కూడదు.