మత్తయి 7
  • 1 మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు.
  • 2 మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును.
  • 3 నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?
  • 4 నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచినీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల?
  • 5 వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కన బడును.
  • 6 పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చి వేయును.
  • 7 అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును,ఒ తట్టుడి మీకు తీయబడును.
  • 8 అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయ బడును.
  • 9 మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా?
  • 10 మీరు చెడ్డ వారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగి యుండగా
  • 11 పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును.
  • 12 కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉప దేశము నైయున్నది.
  • 13 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు.
  • 14 ​జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.
  • 15 అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.
  • 16 వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయు దురా?
  • 17 ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు, కానిఫలములు ఫలించును.
  • 18 మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు.
  • 19 మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.
  • 20 కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.
  • 21 ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
  • 22 ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
  • 23 అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును.
  • 24 కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును.
  • 25 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు.
  • 26 మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.
  • 27 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.
  • 28 యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహ ములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి.
  • 29 ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను.