విలాపవాక్యములు 3
  • 1 నేను ఆయన ఆగ్రహదండముచేత బాధ ననుభవించిన నరుడను.
  • 2 ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు.
  • 3 మాటి మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు
  • 4 ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింప జేయుచున్నాడు. నా యెముకలను విరుగగొట్టుచున్నాడు
  • 5 నాకు అడ్డముగా కంచె వేసియున్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టు మొలిపించి యున్నాడు
  • 6 పూర్వకాలమున చనిపోయినవారు నివసించునట్లు ఆయన చీకటిగల స్థలములలో నన్ను నివసింపజేసి యున్నాడు
  • 7 ఆయన నా చుట్టు కంచె వేసియున్నాడు నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంకెళ్లు నాకు వేసియున్నాడు
  • 8 నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు.
  • 9 ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడురాళ్లు కట్టియున్నాడు నేను పోజాలకుండ నా త్రోవలను కట్టివేసి యున్నాడు
  • 10 నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి వలె ఉన్నాడు చాటైన చోటులలోనుండు సింహమువలె ఉన్నాడు
  • 11 నాకు త్రోవలేకుండచేసి నా యవయవములను విడదీసి యున్నాడు నాకు దిక్కు లేకుండ చేసియున్నాడు
  • 12 విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలువబెట్టియున్నాడు
  • 13 తన అంబులపొదిలోని బాణములన్నియు ఆయన నా ఆంత్రములగుండ దూసిపోజేసెను.
  • 14 నావారికందరికి నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడ నైతిని.
  • 15 చేదువస్తువులు ఆయన నాకు తినిపించెను మాచిపత్రి ద్రావకముచేత నన్ను మత్తునిగా చేసెను
  • 16 రాళ్లచేత నా పండ్లు ఊడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను.
  • 17 నెమ్మదికిని నాకును ఆయన బహు దూరము చేసి యున్నాడు మేలు ఎట్టిదో నేను మరచియున్నాను.
  • 18 నాకు బలము ఉడిగెను అనుకొంటిని యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని.
  • 19 నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి పత్రిని చేదును జ్ఞాపకము చేసికొనుము.
  • 20 ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసికొని నాలో క్రుంగియున్నది అది నీకింకను జ్ఞాపకమున్నది గదా.
  • 21 నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది.
  • 22 యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.
  • 23 అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టు చున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు.
  • 24 యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయనయందు నేను నమి్మక యుంచుకొనుచున్నాను.
  • 25 తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయా ళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.
  • 26 నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
  • 27 ¸°వనకాలమున కాడి మోయుట నరునికి మేలు.
  • 28 అతనిమీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండ వలెను.
  • 29 నిరీక్షణాధారము కలుగునేమో యని అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను.
  • 30 అతడు తన్ను కొట్టువానితట్టు తన చెంపను త్రిప్ప వలెను. అతడు నిందతో నింపబడవలెను
  • 31 ప్రభువు సర్వకాలము విడనాడడు.
  • 32 ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలి పడును.
  • 33 హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము నైనను బాధనైనను కలుగజేయడు.
  • 34 దేశమునందు చెరపట్టబడినవారినందరిని కాళ్లక్రింద త్రొక్కుటయు
  • 35 మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొల గించుటయు
  • 36 ఒకనితో వ్యాజ్యెమాడి వానిని పాడుచేయుటయు ప్రభువు మెచ్చుకార్యములు కావు.
  • 37 ప్రభువు సెలవులేనిది మాట యిచ్చి నెరవేర్చగలవా డెవడు?
  • 38 మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును బయలు వెళ్లునుగదా?
  • 39 సజీవులేల మూల్గుదురు? నరులు తమ పాపశిక్షనుబట్టి ఏల మూల్గుదురు?
  • 40 మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము.
  • 41 ఆకాశమందున్న దేవునితట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము.
  • 42 మేము తిరుగుబాటు చేసినవారము ద్రోహులము నీవు మమ్మును క్షమింపలేదు.
  • 43 కోపము ధరించుకొనినవాడవై నీవు మమ్మును తరుము చున్నావు దయ తలచక మమ్మును చంపుచున్నావు.
  • 44 మా ప్రార్థన నీయొద్ద చేరకుండ నీవు మేఘముచేత నిన్ను కప్పుకొనియున్నావు.
  • 45 జనముల మధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టి యున్నావు.
  • 46 మా శత్రువులందరు మమ్మును చూచి యెగతాళి చేసెదరు.
  • 47 భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి.
  • 48 నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది.
  • 49 యెహోవా దృష్టియుంచి ఆకాశమునుండి చూచు వరకు
  • 50 నా కన్నీరు ఎడతెగక కారుచుండును.
  • 51 నా పట్టణపు కుమార్తెలనందరిని చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని.
  • 52 ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు.
  • 53 వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నాపైన రాయి యుంచిరి
  • 54 నీళ్లు నా తలమీదుగా పారెను నాశనమైతినని నేననుకొంటిని.
  • 55 యెహోవా, అగాధమైన బందీగృహములోనుండి నేను నీ నామమునుబట్టి మొరలిడగా
  • 56 నీవు నా శబ్దము ఆలకించితివి సహాయముకొరకు నేను మొఱ్ఱపెట్టగా చెవిని మూసికొనకుము.
  • 57 నేను నీకు మొరలిడిన దినమున నీవు నాయొద్దకు వచ్చితివి భయపడకుమి అని నీవు చెప్పితివి.
  • 58 ప్రభువా, నీవు నా ప్రాణవిషయమైన వ్యాజ్యెము లను వాదించితివి నా జీవమును విమోచించితివి.
  • 59 యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి యున్నావు నా వ్యాజ్యెము తీర్చుము.
  • 60 పగతీర్చుకొనవలెనని వారు నామీద చేయు ఆలోచన లన్నియు నీవెరుగుదువు.
  • 61 యెహోవా, వారి దూషణయు వారు నామీద చేయు ఆలోచనలన్నిటిని
  • 62 నామీదికి లేచినవారు పలుకు మాటలును దినమెల్ల వారు నామీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు.
  • 63 వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కని పెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతిని.
  • 64 యెహోవా, వారి చేతిక్రియనుబట్టి నీవు వారికి ప్రతీ కారము చేయుదువు.
  • 65 వారికి హృదయకాఠిన్యము నిత్తువు వారిని శపించుదువు.
  • 66 నీవు కోపావేశుడవై వారిని తరిమి యెహోవాయొక్క ఆకాశముక్రింద నుండకుండ వారిని నశింపజేయుదువు.