మార్కు 11
  • 1 వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చి నప్పుడు, ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి
  • 2 మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న యొక గాడిద పిల్ల కన బడును; దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండ లేదు; దానిని విప్పి, తోలుకొని రండి.
  • 3 ఎవడైననుమీరెందుకు ఈలాగు చేయు చున్నారని మిమ్ము నడిగిన యెడలఅది ప్రభువునకు కావలసియున్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికితోలి పంపునని చెప్పి వారిని పంపెను.
  • 4 వారు వెళ్లగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడియున్న గాడిద పిల్ల యొకటి వారికి కనబడెను; దానిని విప్పుచుండగా,
  • 5 అక్కడ నిలిచియున్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి.
  • 6 అందుకు శిష్యులు, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి.
  • 7 వారు ఆ గాడిదపిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుం డెను.
  • 8 అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి.
  • 9 మరియు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండిన వారును జయము1
  • 10 ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రియైన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము1 అని కేకలు వేయుచుండిరి.
  • 11 ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి, చుట్టు సమస్తమును చూచి, సాయంకాల మైనందున పండ్రెండుమందితో కూడ బేతనియకు వెళ్లెను.
  • 12 మరునాడు వారు బేతనియనుండి వెళ్లుచుండగా ఆయన ఆకలిగొని
  • 13 ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దానిమీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు; ఏలయనగా అది అంజూరపు పండ్లకాలము కాదు.
  • 14 అందుకాయనఇకమీదట ఎన్నటి కిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను ; ఇది ఆయన శిష్యులు వినిరి.
  • 15 వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవా లయములో ప్రవేశించి, దేవాలయములో క్రయ విక్రయ ములు చేయువారిని వెళ్లగొట్ట నారంభించి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీటలను పడద్రోసి
  • 16 దేవాలయము గుండ ఏపాత్రయైనను ఎవనిని తేనియ్య కుండెను.
  • 17 మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను.
  • 18 శాస్త్రులును ప్రధానయాజకులును ఆ మాట విని, జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్య పడుట చూచి, ఆయనకు భయపడి, ఆయన నేలాగు సంహరించుదమా అని సమయము చూచుచుండిరి.
  • 19 సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములోనుండి బయలుదేరెను.
  • 20 ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూ రపుచెట్టు వేళ్లు మొదలుకొని యెండియుండుట చూచిరి.
  • 21 అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొనిబోధకుడా, యిదిగో నీవు శపించిన అంజూరపుచెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను.
  • 22 అందుకు యేసు వారితో ఇట్లనెనుమీరు దేవునియందు విశ్వాసముంచుడి.
  • 23 ఎవడైనను ఈ కొండను చూచినీవు ఎత్తబడి సముద్ర ములో పడవేయబడు మని చెప్పి, తన మనస్సులో సందే హింపక తాను చెప్పినది జరుగునని నమి్మనయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
  • 24 అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.
  • 25 మీకు ఒకనిమీద విరోధ మేమైనను కలిగియున్న యెడల, మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి.
  • 26 అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును.
  • 27 వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలును ఆయనయొద్దకువచ్చి
  • 28 నీవు ఏ అధి కారమువలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ యధికారము నీకెవడిచ్చెనని అడిగిరి.
  • 29 అందుకు యేసునేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నా కుత్తరమియ్యుడి, అప్పుడు నేను ఏ అధికారమువలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును.
  • 30 యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడని చెప్పెను.
  • 31 అందుకు వారుమనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల, ఆయనఆలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును;
  • 32 మనుష్యులవలన కలిగిన దని చెప్పుదుమా అని తమలోతాము ఆలోచించుకొనిరి గాని, అందరు యోహాను నిజముగా ప్రవక్త యని యెంచిరి
  • 33 గనుక ప్రజలకు భయపడిఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసుఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు నేను మీతో చెప్పననెను.