1 దినవృత్తాంతములు 16
  • 1 ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసికొని... వచ్చి, దావీదు దానికొరకు వేయించియున్న గుడారము నడుమను దాని ఉంచి, దేవుని సన్నిధిని దహనబలులను సమాధానబలులను అర్పించిరి.
  • 2 దహనబలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి
  • 3 పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్షపండ్ల అడను పంచి పెట్టెను.
  • 4 మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును ఆయ నకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియ మించెను.
  • 5 వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతివాడు, యెమీయేలు షెమీరామోతు యెహీయేలు మత్తిత్యా ఏలీయాబు బెనాయా ఓబేదెదోము యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి, ఆసాపు తాళములను వాయించువాడు.
  • 6 ​బెనాయా యహజీయేలు అను యాజ కులు ఎప్పుడును దేవుని నిబంధన మందసము ఎదుట బూరలు ఊదువారు.
  • 7 ​ఆ దినమందు యెహోవాను స్తుతిచేయు విచారణను ఏర్పరచి, దావీదు ఆసాపుచేతికిని వాని బంధువులచేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా
  • 8 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.ఆయన నామమును ప్రకటనచేయుడిఆయన కార్యములను జనములలో తెలియజేయుడి.
  • 9 ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడిఆయన అద్భుత క్రియలన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి.
  • 10 ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యెహోవాను వెదకువారు హృదయమునందు సంతో షించుదురు గాక.
  • 11 యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడిఆయన సన్నిధి నిత్యము వెదకుడి.
  • 12 ఆయన దాసులగు ఇశ్రాయేలు వంశస్థులారాఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా
  • 13 ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసి కొనుడిఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసికొనుడి.
  • 14 ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి.
  • 15 మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్పసంఖ్యగల జనులుగానుకనాను దేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాని నీకిచ్చెదనని
  • 16 ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను
  • 17 ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి.
  • 18 వేయితరములవరకు ఆ మాట నిలుచునని ఆయన సెల విచ్చెను.
  • 19 యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్యనిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరచియున్నాడు.
  • 20 వారు జనమునుండి జనమునకును రాజ్యమునుండిరాజ్యమునకును తిరుగులాడుచుండగా
  • 21 నేను అభిషేకించినవారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడుచేయవద్దనియు సెలవిచ్చి
  • 22 ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్యలేదు వారి నిమిత్తము రాజులను గద్దించెను.
  • 23 సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి.
  • 24 అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములనుప్రచురించుడి.
  • 25 యెహోవా మహా ఘనత వహించినవాడు ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు.
  • 26 జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవైశాల్యమును సృజించినవాడు.
  • 27 ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి.
  • 28 జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమాబలమును యెహోవాకు చెల్లించుడి.
  • 29 యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొనిఆయనయెదుట సాగిలపడుడి.
  • 30 భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి అప్పుడు భూలోకము కదలకుండును అప్పుడది స్థిరపరచబడును.
  • 31 యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక
  • 32 సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక పొలములును వాటియందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు.
  • 33 భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సయించును.
  • 34 యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి.
  • 35 దేవా మా రక్షకా, మమ్మును రక్షించుము మమ్మును చేర్చుకొనుము.
  • 36 మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశములోనుండి మమ్మును విడిపింపుము. అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరు ఆమేన్‌ అని చెప్పి యెహోవాను స్తుతించిరి.
  • 37 అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసముమీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఓబేదె దోమును వారి సహోదరులైన అరువది ఎనిమిది మందిని
  • 38 యెదూతూను కుమారుడైన ఓబేదెదోమును హోసాను ద్వారపాలకులుగా నియమించెను
  • 39 గిబియోనులోని ఉన్నతస్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము
  • 40 ​ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను.
  • 41 ​యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతిచేయుటకై వీరితోకూడ హేమానును యెదూతూనును పేళ్లవరుసను ఉదాహరింపబడిన మరి కొందరిని నియమించెను.
  • 42 బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవునిగూర్చి పాడతగిన గీతము లను వాద్యములతో వినిపించుటకును వీరిలోనుండు హేమానును యెదూతూనును అతడు నియమించెను.మరియు యెదూతూను కుమారులను అతడు ద్వార పాలకులుగా నియమించెను.
  • 43 తరువాత జనులందరును తమతమ యిండ్లకు వెళ్లిపోయిరి; దావీదును తన యింటి వారిని దీవించుటకై వారియొద్దకు పోయెను.