1 దినవృత్తాంతములు 5
  • 1 ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై యుండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమా రులకియ్యబడెను; అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠు డుగా దాఖలుచేయబడలేదు.
  • 2 యూదా తన సహోద రులకంటె హెచ్చినవాడాయెను, అతనినుండి ప్రముఖుడు బయలువెడలెను, అయినను జన్మస్వాతంత్ర్యము యోసేపు దాయెను.
  • 3 ఇశ్రాయేలునకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారు లెవరనగా హనోకు పల్లు హెస్రోను కర్మీ.
  • 4 యోవేలు కుమారులలో ఒకడు షెమయా, షెమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు,
  • 5 ​షిమీకి మీకా కుమారుడు, మీకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు,
  • 6 బయలునకు బెయేర కుమారుడు, ఇతడు రూబేనీయులకు పెద్ద. అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని చెరతీసికొని పోయెను.
  • 7 వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబ ముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలినవారు యెహీయేలును, జెకర్యాయును,
  • 8 ​యోవేలు కుమారుడైన షెమకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెల యును. బెల వంశపువారు అరోయేరునందును నెబో వరకును బయల్మెయోనువరకును కాపురముండిరి.
  • 9 ​వారి పశువులు గిలాదుదేశమందు అతివిస్తారము కాగా తూర్పున యూఫ్రటీసునది మొదలుకొని అరణ్యపు సరిహద్దువరకును వారు కాపురముండిరి.
  • 10 ​సౌలు దినములలో వారు హగ్రీ యీలతో యుద్ధము జరిగించి వారిని హతముచేసి గిలాదు తూర్పువైపువరకు వారి గుడారములలో కాపురముండిరి.
  • 11 గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కావరకు కాపురముండిరి.
  • 12 వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు, రెండవ తెగవారు షాపామువారు. షాపామువారును యహనైవారును షాపాతువారును బాషానులో ఉండిరి.
  • 13 వారి పితరుల యింటివారైన వారి సహోదరులు ఏడుగురు, మిఖాయేలు మెషుల్లాము షేబయోరై యకాను జీయ ఏబెరు.
  • 14 వీరు హూరీ అనువానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరీ యరోయకు యారోయ గిలాదునకు గిలాదు మిఖాయేలు నకు మిఖాయేలు యెషీషైకి యెషీషై యహదోకు యహదో బూజునకు పుట్టిరి.
  • 15 గూనీ కుమారుడైన అబ్దీ యేలునకు పుట్టిన అహీ వారి పితరుల యిండ్లవారికి పెద్ద.
  • 16 వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామములయందును షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతములవరకు కాపురముండిరి.
  • 17 వీరందరు యూదా రాజైన యోతాము దినములలోను ఇశ్రాయేలు రాజైన యరోబాము దినములలోను తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి.
  • 18 రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్ధ గోత్రమువారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబువేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగినవారు నలువది నాలుగువేల ఏడువందల అరువదిమంది యుండిరి.
  • 19 వీరు హగ్రీయీలతోను యెతూరువారితోను నాపీషు వారితోను నోదాబువారితోను యుద్ధముచేసిరి.
  • 20 యుద్ధమందు వారు దేవునికి మొఱ్ఱపెట్టగా, ఆయనమీద వారు నమి్మకయుంచినందున ఆయన వారి మొఱ్ఱ ఆలకించెను
  • 21 గనుక వారిని జయించు టకు వారికి సహాయము కలిగెను. హగ్రీయీలును వారితో ఉన్నవారందరును వారిచేతికి అప్పగింపబడిరి; వారు ఏబది వేల ఒంటెలను పశువులను రెండులక్షల ఏబదివేల గొఱ్ఱలను రెండువేల గాడిదలను లక్ష జనమును పట్టుకొనిరి.
  • 22 యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుటచేత శత్రువులు అనేకులు పడిపోయిరి; తాము చెరతీసికొని పోబడు వరకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రమువారును వీరి స్థానములయందు కాపురముండిరి.
  • 23 మనష్షే అర్ధగోత్రమువారును ఆ దేశమందు కాపుర ముండి వర్ధిల్లుచు, బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును శెనీరువరకును హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి.
  • 24 వారి పితరుల యిండ్లకు పెద్దలైనవారెవరనగా ఏఫెరు ఇషీ ఎలీయేలు అజ్రీయేలు యిర్మీయా హోదవ్యా యహదీయేలు; వీరు కీర్తిపొందిన పరాక్రమ శాలులై తమ పితరుల యిండ్లకు పెద్దలైరి.
  • 25 ​అయితే వారు తమ పితరుల దేవునిమీద తిరుగుబాటుచేసి, దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి.
  • 26 కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రమువారిని చెరపట్టి నేటికిని కనబడు చున్నట్లుగా హాలహునకును హాబోరునకును హారాకును గోజాను నదీప్రాంతములకును వారిని కొనిపోయెను.