సామెతలు 29
  • 1 ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.
  • 2 నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు.
  • 3 జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోష పరచును వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడుచేయును.
  • 4 న్యాయము జరిగించుటవలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడుచేయును.
  • 5 తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు.
  • 6 దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయును.
  • 7 నీతిమంతుడు బీదలకొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు.
  • 8 అపహాసకులు పట్టణము తల్లడిల్లజేయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు.
  • 9 జ్ఞాని మూఢునితో వాదించునప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును.
  • 10 నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయ జూతురు.
  • 11 బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూప కుండును.
  • 12 అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్థులందరు దుష్టులుగా నుందురు
  • 13 బీదలును వడ్డికిచ్చువారును కలిసికొందురు ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే.
  • 14 ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును.
  • 15 బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.
  • 16 దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులార చూచె దరు.
  • 17 నీ కుమారుని శిక్షించినయెడల అతడు నిన్ను సంతోష పరచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయును
  • 18 దేవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు.
  • 19 దాసుడు వాగ్దండనచేత గుణపడడు తాత్పర్యము తెలిసికొన్నను వాడు లోబడడు
  • 20 ఆతురపడి మాటలాడువాని చూచితివా? వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును.
  • 21 ఒకడు తన దాసుని చిన్నప్పటినుండి గారాబముగా పెంచినయెడల తుదిని వాడు కుమా రుడుగా ఎంచబడును.
  • 22 కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును.
  • 23 ఎవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు ఘనతనొందును
  • 24 దొంగతో పాలుకూడువాడు తనకుతానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు.
  • 25 భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమి్మక యుంచువాడు సురక్షిత ముగా నుండును.
  • 26 అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము.
  • 27 దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు.