సామెతలు 31
  • 1 రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతని కుపదేశించిన దేవోక్తి,
  • 2 నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమా రుడా, నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనే మందును?
  • 3 నీ బలమును స్త్రీలకియ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయ కుము
  • 4 ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమూయేలూ, అది రాజులకు తగదు మద్యపానాసక్తి అధికారులకు తగదు.
  • 5 త్రాగినయెడల వారు కట్టడలను మరతురు దీనులకందరికి అన్యాయము చేయుదురు
  • 6 ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులముగలవారికి ద్రాక్షారసము నియ్యుడి.
  • 7 వారు త్రాగి తమ పేదరికము మరతురు తమ శ్రమను ఇక తలంచకుందురు.
  • 8 మూగవారికిని దిక్కులేనివారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము.
  • 9 నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడువారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము.
  • 10 గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది.
  • 11 ఆమె పెనిమిటి ఆమెయందు నమి్మకయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు.
  • 12 ఆమె తాను బ్రదుకు దినములన్నియు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు.
  • 13 ఆమె గొఱ్ఱబొచ్చును అవిసెనారను వెదకును తన చేతులార వాటితో పనిచేయును.
  • 14 వర్తకపు ఓడలు దూరమునుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరమునుండి ఆహారము తెచ్చుకొనును.
  • 15 ఆమె చీకటితోనే లేచి, తన యింటివారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును.
  • 16 ఆమె పొలమును చూచి దానిని తీసికొనును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోట యొకటి నాటించును.
  • 17 ఆమె నడికట్టుచేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పనిచేయును
  • 18 తన వ్యాపారలాభము అనుభవముచే తెలిసికొనును రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు.
  • 19 ఆమె పంటెను చేత పట్టుకొనును తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును.
  • 20 దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును
  • 21 తన యింటివారికి చలి తగులునని భయపడదు ఆమె యింటివారందరు రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు.
  • 22 ఆమె పరుపులను సిద్ధపరచుకొనును ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు.
  • 23 ఆమె పెనిమిటి దేశపు పెద్దలతోకూడ కూర్చుం డును గవినియొద్ద పేరుగొనినవాడై యుండును.
  • 24 ఆమె నారబట్టలు నేయించి అమ్మునునడికట్లను వర్తకులకు అమ్మును.
  • 25 బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును.
  • 26 జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును.
  • 27 ఆమె తన యింటివారి నడతలను బాగుగా కని పెట్టును పనిచేయకుండ ఆమె భోజనము చేయదు.
  • 28 ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు చాలమంది కుమార్తెలు పతివ్రతాధర్మము ననుసరించి
  • 29 యున్నారు గాని వారందరిని నీవు మించినదానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును.
  • 30 అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును
  • 31 చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును గవునులయొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.