సామెతలు 4
  • 1 కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి
  • 2 నేను మీకు సదుపదేశము చేసెదను నా బోధను త్రోసివేయకుడి.
  • 3 నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన యేక కుమా రుడనైయుంటిని.
  • 4 ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టు కొననిమ్ము నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు బ్రతుకుదువు.
  • 5 జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించు కొనుము నా నోటిమాటలను మరువకుము. వాటినుండి తొలగిపోకుము.
  • 6 జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును.
  • 7 జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాం శము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించు కొనుము.
  • 8 దాని గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగిలించినయెడల అది నీకు ఘనతను తెచ్చును.
  • 9 అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును.
  • 10 నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీక రించినయెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు.
  • 11 జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థమార్గములో నిన్ను నడిపించియున్నాను.
  • 12 నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు.
  • 13 ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టు కొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము
  • 14 భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము.
  • 15 దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము.
  • 16 అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు.
  • 17 కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగు దురు
  • 18 పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును,
  • 19 భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు.
  • 20 నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము.
  • 21 నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్య కుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము.
  • 22 దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.
  • 23 నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము
  • 24 మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము పెదవులనుండి కుటిలమైన మాటలు రానియ్యకుము.
  • 25 నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను.
  • 26 నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును.
  • 27 నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు కొనుము.