సామెతలు 3
  • 1 నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము.
  • 2 అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవ త్సరములను శాంతిని నీకు కలుగజేయును.
  • 3 దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్య కుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము.
  • 4 అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు.
  • 5 నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము
  • 6 నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.
  • 7 నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచి పెట్టుము
  • 8 అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును.
  • 9 నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘన పరచుము.
  • 10 అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును.
  • 11 నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు.
  • 12 తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.
  • 13 జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు.
  • 14 వెండి సంపాదించుటకంటె జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుటకంటె జ్ఞానలాభము నొందుట మేలు.
  • 15 పగడములకంటె అది ప్రియమైనది నీ యిష్టవస్తువులన్నియు దానితో సమానములు కావు.
  • 16 దాని కుడిచేతిలో దీర్ఘాయువును దాని యెడమచేతిలో ధనఘనతలును ఉన్నవి.
  • 17 దాని మార్గములు రమ్యమార్గములు దాని త్రోవలన్నియు క్షేమకరములు.
  • 18 దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.
  • 19 జ్ఞానమువలన యెహోవా భూమిని స్థాపించెను వివేచనవలన ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచెను.
  • 20 ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించు చున్నవి మేఘములనుండి మంచుబిందువులు కురియుచున్నవి.
  • 21 నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము వాటిని నీ కన్నుల ఎదుటనుండి తొలగిపోనియ్యకుము
  • 22 అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును
  • 23 అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు.
  • 24 పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు.
  • 25 ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు
  • 26 యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపా డును.
  • 27 మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.
  • 28 ద్రవ్యము నీయొద్ద నుండగా రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు.
  • 29 నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించు నపుడు వానికి అపకారము కల్పింపవద్దు.
  • 30 నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా జగడ మాడవద్దు.
  • 31 బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకుము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయ గోర వద్దు
  • 32 కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును.
  • 33 భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.
  • 34 అపహాసకులను ఆయన అపహసించును దీనునియెడల ఆయన దయ చూపును.
  • 35 జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. బుద్ధిహీనులు అవమానభరితులగుదురు.