సామెతలు 16
  • 1 హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలు గును.
  • 2 ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును.
  • 3 నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును.
  • 4 యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను.
  • 5 గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు.
  • 6 కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు.
  • 7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.
  • 8 అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము.
  • 9 ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును
  • 10 దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు.
  • 11 న్యాయమైన త్రాసును తూనికరాళ్లును యెహోవా యొక్క యేర్పాటులు సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించెను.
  • 12 రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతివలన సింహాసనము స్థిరపరచబడును.
  • 13 నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు.
  • 14 రాజు క్రోధము మరణదూత జ్ఞానియైనవాడు ఆ క్రోధమును శాంతిపరచును.
  • 15 రాజుల ముఖప్రకాశమువలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు.
  • 16 అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును సంపా దించుట ఎంతో శ్రేష్ఠము వెండిని సంపాదించుటకంటె తెలివిని సంపాదించుట ఎంతో మేలు.
  • 17 చెడుతనము విడిచి నడచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును.
  • 18 నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును
  • 19 గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకొనుటకంటె దీనమనస్సు కలిగి దీనులతో పొత్తుచేయుట మేలు.
  • 20 ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునొందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు.
  • 21 జ్ఞానహృదయుడు వివేకి యనబడును రుచిగల మాటలు పలుకుటవలన విద్యయెక్కువగును.
  • 22 తెలివిగలవానికి వాని తెలివి జీవపు ఊట మూఢులకు వారి మూఢత్వమే శిక్ష
  • 23 జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును.
  • 24 ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి.
  • 25 ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును.
  • 26 కష్టము చేయువాని ఆకలి వానికొరకు వానిచేత కష్టము చేయించును వాని కడుపు వానిని తొందరపెట్టును.
  • 27 పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవులమీద అగ్ని మండుచున్నట్టున్నది.
  • 28 మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును.
  • 29 బలాత్కారి తన పొరుగువానిని లాలనచేయును కానిమార్గములో వాని నడిపించును.
  • 30 కృత్రిమములు కల్పింపవలెనని కన్నులు మూసికొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు.
  • 31 నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును.
  • 32 పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు
  • 33 చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము.