యోబు 8
  • 1 అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లనెను
  • 2 ఎంత కాలము నీవిట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివాయెను.
  • 3 దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా?
  • 4 నీ కుమారులు ఆయన దృష్టియెదుట పాపముచేసిరేమోకావుననే వారు చేసిన తిరుగుబాటునుబట్టి ఆయనవారిని అప్పగించెనేమో.
  • 5 నీవు జాగ్రత్తగా దేవుని వెదకినయెడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనినయెడల
  • 6 నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైనయెడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేయును.
  • 7 అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు.
  • 8 మనము నిన్నటివారమే, మనకు ఏమియు తెలియదు భూమిమీద మన దినములు నీడవలె నున్నవి.
  • 9 మునుపటి తరమువారి సంగతులు విచారించుము వారి పితరులు పరీక్షించినదానిని బాగుగా తెలిసి కొనుము.
  • 10 వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపు దురు గదావారు తమ అనుభవమునుబట్టి మాటలాడుదురు గదా.
  • 11 బురద లేకుండ జమ్ము పెరుగునా?నీళ్లు లేకుండ రెల్లు మొలచునా?
  • 12 అది కోయబడకముందు బహు పచ్చగానున్నది కాని యితర మొక్కలన్నిటికంటె త్వరగా వాడిపోవును.
  • 13 దేవుని మరచువారందరి గతి అట్లే ఉండునుభక్తిహీనుని ఆశ నిరర్థకమగును అతని ఆశ భంగమగును.
  • 14 అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే.
  • 15 అతడు తన యింటిమీద ఆనుకొనగా అది నిలువదు.
  • 16 అతడు గట్టిగా దాని పట్టుకొనగా అది విడిపోవును.ఎండకు అతడు పచ్చిపట్టి బలియును అతని తీగెలు అతని తోటమీద అల్లుకొనును.
  • 17 అతని వేళ్లు గట్టుమీద చుట్టుకొనునురాళ్లుగల తన నివాసమును అతడు తేరిచూచును.
  • 18 దేవుడు అతని స్థలములోనుండి అతని వెళ్లగొట్టినయెడల అదినేను నిన్నెరుగను ఎప్పుడును నిన్ను చూడలేదనును.
  • 19 ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము అతడున్న ధూళినుండి ఇతరులు పుట్టెదరు.
  • 20 ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు.ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు.
  • 21 నిన్ను పగపట్టువారు అవమానభరితులగుదురుదుష్టుల గుడారము ఇక నిలువకపోవును.
  • 22 అయితే ఇంకను ఆయన నీకు నోటినిండ నవ్వు కలుగ జేయును.ప్రహర్షముతో నీ పెదవులను నింపును.