యోబు 34
  • 1 అప్పుడు ఎలీహు మరల ఈలాగు చెప్పసాగెను
  • 2 జ్ఞానులారా, నా మాటలు వినుడి అనుభవశాలులారా, నాకు చెవియొగ్గుడి
  • 3 అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును.
  • 4 న్యాయమైనదేదో విచారించి చూతము రండి మేలైనదేదో మనంతట మనము విచారించి తెలిసి కొందము రండి.
  • 5 నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను
  • 6 న్యాయవంతుడనై యుండియు నేను అబద్దికునిగా ఎంచబడుచున్నానునేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు.
  • 7 యోబువంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారమును పానముచేయుచున్నాడు.
  • 8 అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయెను భక్తిహీనులకు సహవాసి ఆయెను.
  • 9 నరులు దేవునితో సహవాసము చేయుట వారి కేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు.
  • 10 విజ్ఞానముగల మనుష్యులారా, నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము
  • 11 నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చును అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫల మిచ్చును.
  • 12 దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు.
  • 13 ఎవడైన భూమిని ఆయనకు అప్పగింతపెట్టెనా? ఎవడైన సర్వప్రపంచ భారమును ఆయన కప్పగించెనా?
  • 14 ఆయన తన మనస్సు తనమీదనే ఉంచుకొనిన యెడల తన శ్వాసనిశ్వాసములను తనయొద్దకు తిరిగి తీసికొనిన యెడల
  • 15 శరీరులందరు ఏకముగా నశించెదరు నరులు మరల ధూళియై పోవుదురు.
  • 16 కావున దీని విని వివేచించుము నా మాటల నాలకింపుము.
  • 17 న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా? న్యాయసంపన్నుడైనవానిమీద నేరము మోపుదువా?
  • 18 నీవు పనికిమాలినవాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా?
  • 19 రాజులయెడల పక్షపాతము చూపనివానితోను బీదలకన్న ధనముగలవారిని ఎక్కువగా చూడని వాని తోను ఆలాగు పలుకుట తగునా? వారందరు ఆయన నిర్మించినవారు కారా?
  • 20 వారు నిమిషములో చనిపోవుదురు మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునొంది నాశనమగుదురు బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు.
  • 21 ఆయన దృష్టి నరుల మార్గములమీద నుంచబడియున్నది ఆయన వారినడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు.
  • 22 దుష్‌క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటియైనను మరణాంధకారమైనను లేదు.
  • 23 ఒకడు న్యాయవిమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణచేయుట దేవునికి అగత్యము లేదు.
  • 24 విచారణ లేకుండనే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు.
  • 25 వారి క్రియలను ఆయన తెలిసికొనుచున్నాడు రాత్రియందు ఆయన నాశనము కలుగజేయగా వారు నలుగగొట్టబడుదురు.
  • 26 దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును.
  • 27 ఏలయనగా వారు ఆయనను అనుసరించుట మానిరి ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్యపెట్టకపోయిరి.
  • 28 బీదల మొఱ్ఱను ఆయనయొద్దకు వచ్చునట్లు చేసిరి దీనుల మొఱ్ఱను ఆయనకు వినబడునట్లు చేసిరి.
  • 29 ఆయన సమాధానము కలుగజేసినయెడల శిక్ష విధింప గలవాడెవడు?ఆయన తన ముఖమును దాచుకొనినయెడలఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చిన దైనను ఒకటే
  • 30 భక్తిహీనులు రాజ్యపరిపాలన చేయకుండునట్లు వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతు లను ఆయన నిర్మూలము చేయుచున్నాడు
  • 31 ఒకడునేను శిక్షనొందితిని నేను ఇకను పాపము చేయను
  • 32 నాకు తెలియనిదానిని నాకు నేర్పుము నేను దుష్కార్యము చేసియున్న యెడల ఇకను చేయనని దేవునితో చెప్పునా?
  • 33 నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతికారముచేయునా? లేనియెడల నీవుందువా? నేను కాదు నీవేనిశ్చయింపవలెను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము.
  • 34 వివేచనగలవారు జ్ఞానముగలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు
  • 35 యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి
  • 36 దుష్టులవలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరు చున్నాను.
  • 37 అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చు కొనుచున్నాడు మనయెదుట చప్పట్లుకొట్టి దేవునిమీద కాని మాటలు పెంచుచున్నాడు.