యోబు 36
  • 1 మరియు ఎలీహు ఇంక యిట్లనెను
  • 2 కొంతసేపు నన్ను ఓర్చుకొనుము ఈ సంగతి నీకు తెలియజేసెదను. ఏలయనగా దేవునిపక్షముగా నేనింకను మాటలాడ వలసి యున్నది.
  • 3 దూరమునుండి నేను జ్ఞానము తెచ్చుకొందును నన్ను సృజించినవానికి నీతిని ఆరోపించెదను.
  • 4 నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు పూర్ణజ్ఞాని యొకడు నీ యెదుట నున్నాడు.
  • 5 ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు ఆయన వివేచనాశక్తి బహు బలమైనది.
  • 6 భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును.
  • 7 నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనముమీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు.
  • 8 వారు సంకెళ్లతో కట్టబడినయెడలను బాధాపాశములచేత పట్టబడినయెడలను
  • 9 అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషము లను వారికి తెలియజేయును.
  • 10 ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును.
  • 11 వారు ఆలకించి ఆయనను సేవించినయెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు.
  • 12 వారు ఆలకింపనియెడల వారు బాణములచేత కూలి నశించెదరు. జ్ఞానములేక చనిపోయెదరు.
  • 13 అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించునప్పుడు వారు మొఱ్ఱపెట్టరు.
  • 14 కావున వారు ¸°వనమందే మృతినొందుదురు వారి బ్రదుకు పురుషగాముల బ్రదుకువంటిదగును.
  • 15 శ్రమపడువారిని వారికి కలిగిన శ్రమవలన ఆయన విడిపించును.బాధవలన వారిని విధేయులుగా చేయును.
  • 16 అంతియేకాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పిం చును. ఇరుకులేని విశాలస్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును.
  • 17 దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయవిమర్శయు తీర్పును కూడుకొనియున్నవి.
  • 18 నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయెదవేమో జాగ్రత్తపడుము.
  • 19 నీవు మొఱ్ఱపెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయుబాధనొందకుండ నిన్ను తప్పించునా?
  • 20 జనులను తమ స్థలములలోనుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరుకొనకుము.
  • 21 జాగ్రత్తపడుము చెడుతనము చేయకుండుము. దుఃఖానుభవముకన్న అది మంచిదని నీవు వాని కోరు కొనియున్నావు.
  • 22 ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడుఆయనను పోలిన బోధకుడెవడు?
  • 23 ఆయనకు మార్గము నియమించినవాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును?
  • 24 మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్తపడుము.
  • 25 మనుష్యులందరు దాని చూచెదరు నరులు దూరమున నిలిచి దాని చూచెదరు.
  • 26 ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది.
  • 27 ఆయన ఉదకబిందువులను పైనుండి కురిపించును మంచుతోకూడిన వర్షమువలె అవి పడును
  • 28 మేఘములు వాటిని కుమ్మరించును మనుష్యులమీదికి అవి సమృద్ధిగా దిగును.
  • 29 మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములోనుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా?
  • 30 ఆయన తనచుట్టు తన మెరుపును వ్యాపింపజేయును సముద్రపు అడుగుభాగమును ఆయన కప్పును.
  • 31 వీటివలన ఆయన ఆ యా ప్రజలకు తీర్పుతీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు
  • 32 ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును
  • 33 ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధిచేయును తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును.