యోబు 41
  • 1 నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా?...దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా?
  • 2 నీవు దాని ముక్కుగుండ సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా?
  • 3 అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా?
  • 4 నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసికొనునట్లు అది నీతో నిబంధనచేయునా?
  • 5 నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆట లాడెదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దాని కట్టివేసెదవా?
  • 6 బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా? వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా?
  • 7 దాని ఒంటినిండ ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తలనిండ చేప అలుగులు గుచ్చగలవా?
  • 8 దానిమీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసికొనిన యెడల నీవు మరల ఆలాగున చేయకుందువు.
  • 9 దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరచు కొందుమన్న ఆశ విడిచెదరు దాని పొడ చూచిన మాత్రముచేతనే యెవరికైనను గుండెలు అవిసిపోవును గదా.
  • 10 దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా యెదుట నిలువగలవాడెవడు?
  • 11 నేను తిరిగి ఇయ్యవలసి యుండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశవైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే గదా
  • 12 దాని అవయవములను గూర్చియైనను దాని మహాబల మునుగూర్చియైనను దాని చక్కని తీరునుగూర్చి యైనను పలుకక మౌనముగా నుండను.
  • 13 ఎవడైన దాని పై కవచమును లాగివేయగలడా? దాని రెండు దవడల నడిమికి ఎవడైన రాగలడా?
  • 14 దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్లచుట్టు భయకంపములు కలవు
  • 15 దాని గట్టిపొలుసులు దానికి అతిశయాస్పదము ఎవరును తీయలేని ముద్రచేత అవి సంతనచేయబడి యున్నవి.
  • 16 అవి ఒకదానితో ఒకటి హత్తుకొని యున్నవి. వాటి మధ్యకు గాలి యేమాత్రమును జొరనేరదు.
  • 17 ఒకదానితో ఒకటి అతకబడి యున్నవి భేదింప శక్యము కాకుండ అవి యొకదానితో నొకటి కలిసికొని యున్నవి.
  • 18 అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పలవలె నున్నవి
  • 19 దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దానినుండి లేచును.
  • 20 ఉడుకుచున్న కాగులోనుండి, జమ్ముమంటమీద కాగు చున్న బానలోనుండి పొగ లేచునట్లు దాని నాసికారంధ్రములలోనుండి లేచును.
  • 21 దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును
  • 22 దాని మెడ బలమునకు స్థానము భయము దానియెదుట తాండవమాడుచుండును
  • 23 దాని ప్రక్కలమీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడి రాదు.
  • 24 దాని గుండె రాతివలె గట్టిగా నున్నది అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము.
  • 25 అది లేచునప్పుడు బలిష్ఠులు భయపడుదురు అధిక భయముచేత వారు మైమరతురు.
  • 26 దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే ఈటెలైనను బాణములైనను పంట్రకోలలైనను అక్క రకు రావు.
  • 27 ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కఱ్ఱగాను ఎంచును.
  • 28 బాణము దానిని పారదోలజాలదు వడిసెల రాళ్లు దాని దృష్టికి చెత్తవలె ఉన్నవి.
  • 29 దుడ్డుకఱ్ఱలు గడ్డిపరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును.
  • 30 దాని క్రిందిభాగములుకరుకైనచిల్లపెంకులవలె ఉన్నవి. అది బురదమీద నురిపిడికొయ్యవంటి తన దేహమును పరచుకొనును.
  • 31 కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగ జేయునుసముద్రమును తైలమువలె చేయును.
  • 32 అది తాను నడచిన త్రోవను తన వెనుక ప్రకాశింప జేయును చూచినవారికి సముద్రము నెరసిన వెండ్రుకలుగా తోచును.
  • 33 అది భయములేనిదిగా సృజింపబడినది భూమిమీద దానివంటిదేదియు లేదు.
  • 34 అది గొప్పవాటినన్నిటిని తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికి అది రాజు.