కీర్తనలు 25
  • 1 యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి కొనుచున్నాను.
  • 2 నా దేవా, నీయందు నమి్మక యుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింప నియ్యకుము
  • 3 నీకొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువులేకుండనే ద్రోహము చేయువారు సిగ్గు నొందుదురు.
  • 4 యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము నీత్రోవలను నాకు తేటపరచుము.
  • 5 నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీకొరకు కనిపెట్టుచున్నాను.
  • 6 యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసి కొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసికొనుము అవి పూర్వమునుండి యున్నవే గదా.
  • 7 నా బాల్యపాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసికొనకుము. యెహోవా నీ కృపనుబట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచు కొనుము.
  • 8 యెహోవా ఉత్తముడును యథార్థ వంతుడునై యున్నాడు కావున తన మార్గమునుగూర్చి ఆయన పాపులకు ఉపదేశించును.
  • 9 న్యాయవిధులనుబట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును.
  • 10 ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసన ములను గైకొనువారి విషయములో యెహోవాత్రోవలన్నియు కృపాసత్యమయములై యున్నవి
  • 11 యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమింపుము.
  • 12 యెహోవాయందు భయభక్తులుగలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును.
  • 13 అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును.
  • 14 యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గల వారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును.
  • 15 నా కనుదృష్టి యెల్లప్పుడు యెహోవావైపునకే తిరిగి యున్నది ఆయన నా పాదములను వలలోనుండి విడిపించును.
  • 16 నేను ఏకాకిని, బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము.
  • 17 నా హృదయవేదనలు అతివిస్తారములు ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము.
  • 18 నా బాధను నా వేదనను కనుగొనుము నా పాపములన్నిటిని క్షమింపుము.
  • 19 నా శత్రువులను చూడుము, వారు అనేకులు క్రూరద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు.
  • 20 నేను నీ శరణుజొచ్చి యున్నాను, నన్ను సిగ్గుపడ నియ్యకుము నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము.
  • 21 నీకొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక.
  • 22 దేవా, వారి బాధలన్నిటిలోనుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము.