కీర్తనలు 30
  • 1 యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతో షింపనియ్యక నీవు నన్నుద్ధరించి యున్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను.
  • 2 యెహోవా నా దేవా, నేను నీకు మొఱ్ఱపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి.
  • 3 యెహోవా, పాతాళములోనుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండ నీవు నన్ను బ్రదికించితివి.
  • 4 యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి.
  • 5 ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును.
  • 6 నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అను కొంటిని.
  • 7 యెహోవా, దయకలిగి నీవే నా పర్వతమును స్థిర పరచితివి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత జెందితిని
  • 8 యెహోవా, నీకే మొఱ్ఱపెట్టితిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగినయెడల నా ప్రాణమువలన ఏమి లాభము?
  • 9 మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమునుగూర్చి అది వివరించునా?
  • 10 యెహోవా, ఆలకింపుము నన్ను కరుణింపుము యెహోవా, నాకు సహాయుడవై యుండుము
  • 11 నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి యున్నావు.
  • 12 నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోషవస్త్రము నన్ను ధరింపజేసియున్నావు యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించె దను.