కీర్తనలు 115
  • 1 మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలగునుగాక
  • 2 వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు?
  • 3 మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయు చున్నాడు
  • 4 వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు
  • 5 వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు
  • 6 చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు
  • 7 చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు.
  • 8 వాటిని చేయువారును వాటియందు నమి్మకయుంచు వారందరును వాటివంటివారై యున్నారు.
  • 9 ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము
  • 10 అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము
  • 11 యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమి్మక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము.
  • 12 యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థులనాశీర్వదించును
  • 13 పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును.
  • 14 యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.
  • 15 భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు.
  • 16 ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.
  • 17 మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు
  • 18 మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.