కీర్తనలు 74
  • 1 దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొఱ్ఱలమీద నీ కోపము పొగరాజు చున్నదేమి?
  • 2 నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపా దించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపక మునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సీయోను పర్వతమును జ్ఞాపక మునకు తెచ్చుకొనుము.
  • 3 శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడుచేసియున్నారు నిత్యము పాడైయుండు చోట్లకు విజయము చేయుము.
  • 4 నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించు చున్నారు విజయధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు
  • 5 దట్టమైన చెట్ల గుబురుమీద జనులు గొడ్డండ్ల నెత్తి నట్లుగా వారు కనబడుదురు
  • 6 ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరుగగొట్టుదురు.
  • 7 నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామమందిరమును నేల పడగొట్టి అపవిత్ర పరచు దురు.
  • 8 దేవుని మందిరములను బొత్తిగా అణగద్రొక్కుద మనుకొని దేశములోని వాటినన్నిటిని వారు కాల్చియున్నారు.
  • 9 సూచకక్రియలు మాకు కనబడుటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలము జరుగునో దాని నెరిగినవాడు మాలో ఎవడును లేడు.
  • 10 దేవా, విరోధులు ఎందాక నిందింతురు? శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా?
  • 11 నీ హస్తమును నీ దక్షిణహస్తమును నీవెందుకు ముడుచు కొని యున్నావు? నీ రొమ్ములోనుండి దాని తీసి వారిని నిర్మూలము చేయుము.
  • 12 పురాతనకాలము మొదలుకొని దేవుడు నా రాజై యున్నాడు దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే.
  • 13 నీ బలముచేత సముద్రమును పాయలుగా చేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగుల గొట్టితివి.
  • 14 మకరముయొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టి తివి అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి.
  • 15 బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక జేసితివి
  • 16 పగలు నీదే రాత్రినీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి.
  • 17 భూమికి సరిహద్దులను నియమించినవాడవు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి.
  • 18 యెహోవా, శత్రువులు నిన్ను దూషణచేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకొనుము.
  • 19 దుష్టమృగమునకు నీ గువ్వయొక్క ప్రాణము నప్ప గింపకుము శ్రమనొందు నీవారిని నిత్యము మరువకుము.
  • 20 లోకములోనున్న చీకటిగల చోటులు బలాత్కారుల నివాసములతో నిండియున్నవి. కాగా నిబంధనను జ్ఞాపకము చేసికొనుము
  • 21 నలిగినవానిని అవమానముతో వెనుకకు మరల నియ్య కుము. శ్రమ నొందువారును దరిద్రులును నీ నామము సన్నుతించుదురు గాక.
  • 22 దేవా, లెమ్ము నీ వ్యాజ్యెము నడుపుము అవివేకులు దినమెల్ల నిన్ను నిందించు సంగతి జ్ఞాప కము చేసికొనుము.
  • 23 నీమీదికి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరు చున్నది. నీ విరోధులు చేయు గల్లత్తును మరువకుము.