కీర్తనలు 105
  • 1 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి.
  • 2 ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి
  • 3 ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతో షించుదురుగాక.
  • 4 యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి
  • 5 ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా ఆయన యేర్పరచుకొనిన యాకోబు సంతతివారలారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసి కొనుడి
  • 6 ఆయన చేసిన సూచక క్రియలను ఆయననోటి తీర్పు లను జ్ఞాపకముచేసికొనుడి
  • 7 ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి.
  • 8 తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరములవరకు అబ్రాహాముతో తాను చేసిన నింబధనను
  • 9 ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసికొనును.
  • 10 వారి సంఖ్య కొద్దిగా నుండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై యుండగను
  • 11 కొలవబడిన స్వాస్థ్యముగా కనానుదేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను
  • 12 ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరచి యున్నాడు.
  • 13 వారు జనమునుండి జనమునకును ఒక రాజ్యమునుండి మరియొక రాజ్యమునకు తిరుగు లాడు చుండగా
  • 14 నేనభిషేకించినవారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడుచేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి
  • 15 ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్య లేదు ఆయన వారికొరకు రాజులను గద్దించెను.
  • 16 దేశముమీదికి ఆయన కరవు రప్పించెను జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను.
  • 17 వారికంటె ముందుగా ఆయన యొకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను.
  • 18 వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను.
  • 19 అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను.
  • 20 రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజల నేలినవాడు అతని విడుదలచేసెను.
  • 21 ఇష్టప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును
  • 22 తన యింటికి యజమానునిగాను తన యావదాస్తిమీద అధికారిగాను అతని నియ మించెను.
  • 23 ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను యాకోబు హాముదేశమందు పరదేశిగా నుండెను.
  • 24 ఆయన తన ప్రజలకు బహు సంతానవృద్ధి కలుగ జేసెను వారి విరోధులకంటె వారికి అధికబలము దయచేసెను.
  • 25 తన ప్రజలను పగజేయునట్లును తన సేవకులయెడల కుయుక్తిగా నడచునట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను.
  • 26 ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను.
  • 27 వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను హాముదేశములో మహత్కార్యములను జరిగించిరి
  • 28 ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెను వారు ఆయన మాటను ఎదిరింపలేదు.
  • 29 ఆయన వారి జలములను రక్తముగా మార్చెను వారి చేపలను చంపెను.
  • 30 వారి దేశములో కప్పలు నిండెను అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను.
  • 31 ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెను వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను.
  • 32 ఆయన వారిమీద వడగండ్ల వాన కురిపించెను. వారి దేశములో అగ్నిజ్వాలలు పుట్టించెను.
  • 33 వారి ద్రాక్షతీగెలను వారి అంజూరపు చెట్లను పడ గొట్టెను వారి ప్రాంతములయందలి వృక్షములను విరుగకొట్టెను.
  • 34 ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలును లెక్కలేని చీడపురుగులును వచ్చెను,
  • 35 అవి వారిదేశపు కూరచెట్లన్నిటిని వారి భూమి పంటలను తినివేసెను.
  • 36 వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమసంతానమును ఆయన హతముచేసెను.
  • 37 అక్కడనుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను వారి గోత్రములలో నిస్సత్తువచేత తొట్రిల్లు వాడొక్క డైనను లేకపోయెను.
  • 38 వారివలన ఐగుప్తీయులకు భయము పుట్టెను వారు బయలు వెళ్లినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి
  • 39 వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను రాత్రి వెలుగిచ్చుటకై అగ్నిని కలుగజేసెను.
  • 40 వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశములోనుండి ఆహారమునిచ్చి వారిని తృప్తి పరచెను.
  • 41 బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను ఎడారులలో అవి యేరులై పారెను.
  • 42 ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తనసేవకుడైన అబ్రాహామును జ్ఞాపకము చేసికొని
  • 43 ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకొనినవారిని ఉత్సాహధ్వనితోను వెలు పలికి రప్పించెను.
  • 44 వారు తన కట్టడలను గైకొనునట్లును
  • 45 తన ధర్మశాస్త్రవిధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికప్పగించెను జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిరి.యెహోవాను స్తుతించుడి.