కీర్తనలు 29
  • 1 దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి
  • 2 యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన యెదుట సాగిలపడుడి.
  • 3 యెహోవా స్వరము జలములమీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించుచున్నాడు. మహాజలములమీద యెహోవా సంచరించుచున్నాడు.
  • 4 యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావము గలది.
  • 5 యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును.
  • 6 దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయును లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలె గంతులు వేయునట్లు ఆయన చేయును.
  • 7 యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప జేయుచున్నది.
  • 8 యెహోవా స్వరము అరణ్యమును కదలించును యెహోవా కాదేషు అరణ్యమును కదలించును
  • 9 యెహోవా స్వరము లేళ్ళను ఈనజేయును అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నియు ఆయనకే ప్రభా వము అనుచున్నవి.
  • 10 యెహోవా ప్రళయజలములమీద ఆసీనుడాయెను యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడైయున్నాడు.
  • 11 యెహోవా తన ప్రజలకు బలము ననుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి నాశీర్వదించును.