కీర్తనలు 76
  • 1 యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది.
  • 2 షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది.
  • 3 అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను.(సెలా.)
  • 4 దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యముకంటె నీవు అధిక తేజస్సుగలవాడవు.
  • 5 కఠినహృదయులు దోచుకొనబడి యున్నారు వారు నిద్రనొంది యున్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను.
  • 6 యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుఱ్ఱములకును గాఢనిద్ర కలిగెను.
  • 7 నీవు, నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు?
  • 8 నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడజేసితివి
  • 9 దేశములో శ్రమనొందిన వారినందరిని రక్షించుటకై న్యాయపుతీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను.(సెలా.)
  • 10 నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు.
  • 11 మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను.
  • 12 అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు.