కీర్తనలు 83
  • 1 దేవా, ఊరకుండకుము దేవా, మౌనముగా ఉండకుము ఊరకుండకుము.
  • 2 నీ శత్రువులు అల్లరిచేయుచున్నారు నిన్ను ద్వేషించువారు తల యెత్తి యున్నారు.
  • 3 నీ ప్రజలమీద వారు కపటోపాయములు పన్ను చున్నారు నీ మరుగుజొచ్చిన వారిమీద ఆలోచన చేయు చున్నారు
  • 4 వారుఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాక పోవునట్లు జనముగా నుండకుండ వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు.
  • 5 ఏకమనస్సుతో వారు ఆలోచన చేసికొనియున్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు.
  • 6 గుడారపువాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయు లును మోయాబీయులును హగ్రీయీలును
  • 7 గెబలువారును అమ్మోనీయులును అమాలేకీయులును ఫిలిష్తీయులును తూరు నివాసులును నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు.
  • 8 అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు.(సెలా.)
  • 9 మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటియొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము.
  • 10 వారు ఏన్దోరులో నశించిరి భూమికి పెంట అయిరి.
  • 11 ఓరేబు జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జెబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము.
  • 12 దేవుని నివాసస్థలములను మనము ఆక్రమించు కొందమని వారు చెప్పుకొనుచున్నారు.
  • 13 నా దేవా, సుడి తిరుగు ధూళివలెను గాలి యెదుటి వగుడాకులవలెను వారిని చేయుము
  • 14 అగ్ని అడవిని కాల్చునట్లు కారుచిచ్చు కొండలను తగుల పెట్టునట్లు
  • 15 నీ తుపానుచేత వారిని తరుముము నీ సుడిగాలిచేత వారికి భీతి పుట్టించుము.
  • 16 యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము.
  • 17 వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక వారు భ్రమసి నశించుదురు గాక.
  • 18 యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక.