కీర్తనలు 78
  • 1 నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి నా నోటిమాటలకు చెవియొగ్గుడి
  • 2 నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియ జెప్పెదను.
  • 3 మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను.
  • 4 యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము.
  • 5 రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగు నట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవునియందు నిరీక్షణగలవారై దేవుని క్రియ లను మరువకయుండి
  • 6 యథార్థహృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సులేనివారై తమ పితరులవలె తిరుగబడకయు
  • 7 మూర్ఖతయు తిరుగుబాటునుగల ఆ తరమును పోలి యుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును
  • 8 ఆయన యాకోబు సంతతికి శాసనములను నియ మించెను ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము ననుగ్రహించెను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికాజ్ఞాపించెను
  • 9 విండ్లను పట్టుకొని యుద్దసన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతివారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి
  • 10 వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రము ననుసరింపనొల్లకపోయిరి
  • 11 ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి.
  • 12 ఐగుప్తుదేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను.
  • 13 ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాశిగా నిలిపెను
  • 14 పగటివేళ మేఘములోనుండియు రాత్రి అంతయు అగ్నిప్రకాశములోనుండియు ఆయన వారికి త్రోవ చూపెను
  • 15 అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను.
  • 16 బండలోనుండి ఆయన నీటికాలువలు రప్పించెను నదులవలె నీళ్లు ప్రవహింపజేసెను.
  • 17 అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపముచేయుచునే వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి.
  • 18 వారు తమ ఆశకొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి.
  • 19 ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచ గలడా యనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి.
  • 20 ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా? అని వారు చెప్పుకొనిరి.
  • 21 యెహోవా ఈ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించివేయుటకు అగ్నిరాజెను ఇశ్రాయేలు సంతతిని హరించివేయుటకు కోపము పుట్టెను.
  • 22 వారు దేవునియందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణయందు నమి్మక యుంచలేదు.
  • 23 అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞా పించెను. అంతరిక్షద్వారములను తెరచెను
  • 24 ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను ఆకాశధాన్యము వారి కనుగ్రహించెను.
  • 25 దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను.
  • 26 ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను తన బలముచేత దక్షిణపు గాలి రప్పించెను.
  • 27 ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను.
  • 28 వారి దండు మధ్యను వారి నివాసస్థలములచుట్టును ఆయన వాటిని వ్రాలజేసెను.
  • 29 వారు కడుపార తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను.
  • 30 వారి ఆశ తీరకమునుపే ఆహారము ఇంక వారి నోళ్లలో నుండగానే
  • 31 దేవుని కోపము వారిమీదికి దిగెను వారిలో బలిసినవారిని ఆయన సంహరించెను ఇశ్రాయేలులో ¸°వనులను కూల్చెను.
  • 32 ఇంత జరిగినను వారు ఇంకను పాపముచేయుచు ఆయన ఆశ్చర్యకార్యములనుబట్టి ఆయనను నమ్ము కొనక పోయిరి.
  • 33 కాబట్టి ఆయన, వారి దినములు ఊపిరివలె గడచి పోజేసెను వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడచిపోజేసెను.
  • 34 వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలు కొనిరి.
  • 35 దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసికొనిరి.
  • 36 అయినను వారి హృదయము ఆయనయెడల స్థిరముగా నుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు
  • 37 నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతిచేసిరి తమ నాలుకలతో ఆయనయొద్ద బొంకిరి.
  • 38 అయితే ఆయన వాత్సల్యసంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించు వాడు.తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు.
  • 39 కాగావారు కేవలము శరీరులై యున్నారనియు విసరి, వెళ్లి మరలి రాని గాలివలె నున్నారనియు ఆయన జ్ఞాపకము చేసికొనెను.
  • 40 అరణ్యమున వారు ఆయనమీద ఎన్నిమారులో తిరుగ బడిరి ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి.
  • 41 మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి.
  • 42 ఆయన బాహుబలమునైనను విరోధులచేతిలోనుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు.
  • 43 ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు.
  • 44 ఐగుప్తీయులు త్రాగలేకుండ నైలునది కాలువలను వారి ప్రవాహజలములను ఆయన రక్తముగా మార్చెను
  • 45 ఆయన వారిమీదికి జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసెను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసెను.
  • 46 ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెను వారి కష్టఫలములను మిడతలకప్పగించెను.
  • 47 వడగండ్లచేత వారి ద్రాక్షతీగెలను హిమముచేత వారి మేడిచెట్లను ఆయన పాడు చేసెను.
  • 48 వారి పశువులను వడగండ్ల పాలుచేసెను. వారి మందలను పిడుగుల పాలుచేసెను.
  • 49 ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారిమీద విడిచెను.
  • 50 తన కోపమునకు ఆయన త్రోవ చదునుచేసెను మరణమునుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను.
  • 51 ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని హాము గుడారములలోనున్న బలప్రారంభమైన ప్రథమసంతానమును ఆయన సంహరించెను.
  • 52 అయితే గొఱ్ఱలవలె ఆయన తన ప్రజలను తోడు కొనిపోయెను ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను
  • 53 వారు భయపడకుండ ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను.
  • 54 తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు తన దక్షిణహస్తము సంపాదించిన యీ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించెను.
  • 55 వారియెదుటనుండి అన్యజనులను వెళ్లగొట్టెను. కొలనూలుచేత వారి స్వాస్థ్యమును వారికి పంచి యిచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివ సింపజేసెను.
  • 56 అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనముల ననుసరింపకపోయిరి.
  • 57 తమ పితరులవలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగి పోయిరి.
  • 58 వారు ఉన్నతస్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగ జేసిరి.
  • 59 దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలు నందు బహుగా అసహ్యించుకొనెను.
  • 60 షిలోహు మందిరమును తాను మనుష్యులలో సంస్థా పన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను.
  • 61 ఆయన తన బలమును చెరకును, తన భూషణమైనదానిని విరోధులచేతికిని అప్పగించెను.
  • 62 తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యముమీద ఆగ్రహించెను
  • 63 అగ్ని వారి ¸°వనస్థులను భక్షించెను వారి కన్యకలకు పెండ్లిపాటలు లేకపోయెను.
  • 64 వారి యాజకులు కత్తిపాలుకాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.
  • 65 అప్పుడు నిద్రనుండి మేల్కొను ఒకనివలెను మద్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలెను ప్రభువు మేల్కొనెను.
  • 66 ఆయన తన విరోధులను వెనుకకు తరిమికొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేసెను.
  • 67 పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించు కొనెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు.
  • 68 యూదా గోత్రమును తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకొనెను.
  • 69 తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధమందిరమును కట్టించెను
  • 70 తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱల దొడ్లలోనుండి అతని పిలిపించెను.
  • 71 పాడిగొఱ్ఱలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రా యేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను.
  • 72 అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను.