కీర్తనలు 24
  • 1 భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే.
  • 2 ఆయన సముద్రములమీద దానికి పునాది వేసెను ప్రవాహజలములమీద దాని స్థిరపరచెను.
  • 3 యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?
  • 4 వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.
  • 5 వాడు యెహోవావలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవునివలన నీతిమత్వము నొందును.
  • 6 ఆయన నాశ్రయించువారు యాకోబు దేవా, నీ సన్నిధిని వెదకువారు అట్టివారే. (సెలా.)
  • 7 గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి.
  • 8 మహిమగల యీ రాజు ఎవడు? బలశౌర్యములుగల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా.
  • 9 గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి, పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి.
  • 10 మహిమగల యీ రాజు ఎవడు? సైన్యములకధిపతియగు యెహోవాయే.ఆయనే యీ మహిమగల రాజు.