కీర్తనలు 91
  • 1 మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.
  • 2 ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.
  • 3 వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును
  • 4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.
  • 5 రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను
  • 6 చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు.
  • 7 నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు.
  • 8 నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును
  • 9 యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు
  • 10 నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు
  • 11 నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును
  • 12 నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొం దురు
  • 13 నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కె దవు.
  • 14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను
  • 15 అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను
  • 16 దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను.