కీర్తనలు 90
  • 1 ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే.
  • 2 పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు
  • 3 నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు.
  • 4 నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలె నున్నవి రాత్రియందలి యొక జామువలెనున్నవి.
  • 5 వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు
  • 6 ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును.
  • 7 నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము.
  • 8 మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి.
  • 9 నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితివిు. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము.
  • 10 మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.
  • 11 నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును? నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియును?
  • 12 మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.
  • 13 యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము.
  • 14 ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము.
  • 15 నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది మేము కీడనుభవించిన యేండ్లకొలది మమ్మును సంతోష పరచుము.
  • 16 నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము.
  • 17 మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక మా చేతిపనిని మాకు స్థిరపరచుము మా చేతిపనిని స్థిరపరచుము.