కీర్తనలు 44
  • 1 దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసినపనినిగూర్చి మేము చెవులార విని యున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి
  • 2 నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి.
  • 3 వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచు కొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను.
  • 4 దేవా, నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ కలుగ నాజ్ఞాపించుము.
  • 5 నీవలన మా విరోధులను అణచివేయుదుము నీ నామమువలననే, మామీదికి లేచువారిని మేము త్రొక్కి వేయుదుము.
  • 6 నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు
  • 7 మా శత్రువుల చేతిలోనుండి మమ్మును రక్షించు వాడవు నీవే మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే.
  • 8 దినమెల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము నీ నామమునుబట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.(సెలా.)
  • 9 అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమాన పరచియున్నావు. మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు.
  • 10 శత్రువులయెదుట నిలువకుండ మమ్మును వెనుకకు పారి పోజేయుచున్నావు మమ్మును ద్వేషించువారు ఇష్టమువచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు.
  • 11 భోజనపదార్థముగా ఒకడు గొఱ్ఱలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టి యున్నావు
  • 12 అధికమైన వెల చెప్పక ధనప్రాప్తిలేకయే నీవే నీ ప్రజలను అమి్మ యున్నావు
  • 13 మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పద ముగా చేసియున్నావు మా చుట్టు నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణ ముగాను మమ్మును ఉంచి యున్నావు.
  • 14 అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు.
  • 15 నన్ను నిందించి దూషించువారి మాటలు వినగా శత్రువులనుబట్టియు పగ తీర్చుకొనువారినిబట్టియు
  • 16 నేను దినమెల్ల నా అవమానమును తలపోయుచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది.
  • 17 ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువ లేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు.
  • 18 మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు.
  • 19 అయితే నక్కలున్నచోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధకారముచేత మమ్మును కప్పియున్నావు
  • 20 మా దేవుని నామమును మేము మరచియున్నయెడల అన్యదేవతలతట్టు మా చేతులు చాపియున్నయెడల
  • 21 హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా?
  • 22 నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము వధకు సిద్ధమైన గొఱ్ఱలమని మేము ఎంచబడు చున్నాము
  • 23 ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము.
  • 24 నీ ముఖమును నీ వేల మరుగుపరచి యున్నావు? మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరచి యున్నావు?
  • 25 మా ప్రాణము నేలకు క్రుంగియున్నది మా శరీరము నేలను పట్టియున్నది.
  • 26 మా సహాయమునకు లెమ్ము నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము.