కీర్తనలు 73
  • 1 ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు.
  • 2 నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను.
  • 3 భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.
  • 4 మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా నున్నారు.
  • 5 ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు.
  • 6 కావున గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొను చున్నది వస్త్రమువలె వారు బలాత్కారము ధరించుకొందురు.
  • 7 క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలై యున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చు చున్నవి
  • 8 ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. గర్వముగా మాటలాడుదురు.
  • 9 ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును.
  • 10 వారి జనము వారిపక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు.
  • 11 దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా? అని వారను కొందురు.
  • 12 ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు.
  • 13 నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే
  • 14 దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది.
  • 15 ఈలాగు ముచ్చటింతునని నేననుకొనినయెడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడ నగుదును.
  • 16 అయినను దీనిని తెలిసికొనవలెనని ఆలోచించినప్పుడు
  • 17 నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమునుగూర్చి ధ్యానించువరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను.
  • 18 నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు
  • 19 క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.
  • 20 మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీక రింతువు.
  • 21 నా హృదయము మత్సరపడెను. నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని.
  • 22 నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగమువంటి వాడనైతిని.
  • 23 అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు.
  • 24 నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు
  • 25 ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు.
  • 26 నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గ మును స్వాస్థ్యమునై యున్నాడు.
  • 27 నిన్ను విసర్జించువారు నశించెదరు నిన్ను విడిచి వ్యభిచరించువారినందరిని నీవు సంహ రించెదవు.
  • 28 నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.