కీర్తనలు 60
  • 1 దేవా, మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదరగొట్టి యున్నావు నీవు కోపపడితివి మమ్ము మరల బాగుచేయుము.
  • 2 నీవు దేశమును కంపింపజేసియున్నావు దానిని బద్దలు చేసియున్నావు అది వణకుచున్నది అది పడిపోయిన చోటులు బాగు చేయుము.
  • 3 నీ ప్రజలకు నీవు కఠినకార్యములు చేసితివి తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి
  • 4 సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయభక్తులుగలవారికి నీవొక ధ్వజము నిచ్చి యున్నావు.(సెలా.)
  • 5 నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడిచేత నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము
  • 6 తన పరిశుద్ధతతోడని దేవుడు మాట యిచ్చి యున్నాడు నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను.
  • 7 గిలాదు నాది మనష్షే నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము యూదా నా రాజదండము.
  • 8 మోయాబు నేను కాళ్లు కడుగుకొను పళ్లెము ఎదోముమీద నా చెప్పు విసరివేయుదును ఫిలిష్తియా, నన్నుగూర్చి ఉత్సాహధ్వనిచేయుము.
  • 9 కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును?
  • 10 దేవా, నీవు మమ్ము విడనాడియున్నావు గదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మాని యున్నావు గదా?
  • 11 మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయ చేయుము.
  • 12 దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే.